మహా ప్రియముగల యేసుప్రభూ ! ఎనలేని పుణ్యఫలముల చేతను మీ యింటి యందు చూపించిన సుమాతృక చేతను మీరు భూలోకములో జీవించిన కుటుంబమును ప్రతిష్ఠించి నవ ధరించితిరే. ఇప్పుడు మీ సముఖము నందు సాష్టంగముపడి మీ దయను ప్రార్థించేడు ఈ కుటుంబము మీద మీ కనికరము మీకు సొంతమని స్మరించు కొనండి. ఎందుకనిన, మీకే విశేషమైన విధముగా మమ్మును సమర్పించి ఒప్పజెప్పుచున్నాము. మా మీద కనికర ముంచి, మమ్ము సకల అపాయములలో నుండి కాపాడి, ఇక్కట్టు సమయములో మాకు సహాయముగా నుండండి. మేము మీ పరిశుద్ధ కుటుంబము యొక్క సుమాతృకను అనుసరించునటుల మాకు అనుగ్రహము దయచేయండి. ఈ విధముగా, ఈ భూలోకములో మిమ్ము ప్రామాణికముగా పూజించి, ప్రేమించి మా జీవితాంతమున మోక్షములో సదాకాలము మిమ్ము పొగడి కొనియాడుదుముగాక. పరిశుద్ధ మరియమ్మ! మా మధురమైన తల్లి! మీ దివ్య కుమారుడు మీ మనవి నాలకించునని తెలిసి, మీ సహాయమును కోరి, మీ దాపునకు వచ్చుచున్నాము. మహిమగల పితాపుత్రుడైన జోజప్పగారా! మీరును మీ బలము గల వేడుదల చేత మాకు సహాయముగా నుండండి. మరియమ్మగారి చేతుల ద్వారా మా జపములను జేసునాథుని దివ్యపాదములకు ఒప్పజెప్పండి. ఆమెన్